am

మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని యువకుడి సైకిల్‌ యాత్ర

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుల ప్రతిమలనే ప్రతిష్ఠించాలని ప్రజల్లో చైతన్యం కోసం వరంగల్‌ విద్యార్థి బోడ వినోద్‌ కుమార్‌ సైకిల్‌యాత్ర చేస్తున్నాడు. వరంగల్‌లోని వాగ్దేవి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న వినోద్‌ సెప్టెంబర్‌1న సైకిల్‌యాత్ర ప్రారంభించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయనాలతో తయారైన వినాయక ప్రతిమలు పర్యావరణానికి ఏ విధమైన హాని తలపెడతాయో ఊరూరా వివరిస్తూ.. మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని ప్రచారం నిర్వహిస్తున్నాడు. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిలాల్లో సైకిల్‌ యాత్రను పూర్తి చేసుకుని సోమవారం భువనగిరికి చేరుకున్నాడు. పర్యావరణం కోసం విద్యార్థి చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.

ఢిల్లీలో తెలంగాణభవన్‌కు సిబ్బంది కొరత

ఢిల్లీతో తెలంగాణ భవన్‌కు సమస్యలు వెంటాడుతున్నాయి. అక్కడికి వెళ్లే గెస్ట్‌లకు మర్యాదలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలంగాణభవన్‌కు వెళ్లాలంటేనే నేతలు చికాకు పడే పరిస్థితి ఏర్పడింది. సమాచార విభాగం పనిచేయడమే మానేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలో తెలంగాణకు ప్రత్యేక భవనం కేటాయించారు. ఢిల్లీలో పనిమీద రాష్ట్రం నుంచి వెళ్లే నేతలు అతిథులు ఇక్కడే సేదతీరుతుంటారు. కానీ అక్కడి సదుపాయాలు, సర్వీసింగ్ మాత్రం నేతలకు మింగుడుపడటం లేదు.

రేవంత్‌కు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు

ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీ.టీడీపీ ముఖ్యనేత కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెండు నెలల అనంతరం హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ కేసులో జూన్ 30వ తేదీనే రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించినా కొడంగల్ నియోజ కవర్గానికే పరిమితం కావాలని హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌రెడ్డి తన ఆరోగ్యం బాగాలేదని వైద్యపరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందని కోర్టుకు తెలపడంతో ఆంక్షలు సడలిస్తూ మంగళవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆంక్షలు తొలగించడంతో రేవంత్ ఎప్పటిలాగే పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడపనున్నారు. రెండు నెలల అనంతరం రేవంత్ హైదరాబాద్‌కు రానుండడంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతోఉన్నారు. ఈ రోజు ఉదయం కొడంగల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్‌రెడ్డికి పోలీసు అకాడమీ దగ్గర టీడీపీ కార్యకర్తల ఘనస్వాగతం పలికారు

చావుకు కూడా భయపడని గొప్ప లక్షణం కాళోజిది : కడియం

చావుకు కూడా భయపడని గొప్ప లక్షణం ప్రజాకవి కాళోజి నారాయణరావులో ఉండేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై కాళోజి విమర్శించే తీరు అద్భుతంగా ఉండేవన్నారు. కాళోజిలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతీఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కడియం చెప్పారు. రవీంద్రభారతిలో జరిగిన కాళోజి 101వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రలు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాళోజి పురస్కారాన్ని రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన వేణుగోపాల్‌రావుకు ప్రదానం చేశారు.

ప్రధాని మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై రఘువీరా ఫిర్యాదు

ప్రధాని మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి పెనుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను వారు మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో బయటపడడమే చంద్రబాబుకు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అని అన్నారు. ఇసుక అక్రమ రవాణా మంత్రులు, టీడీపీ నాయకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అని రఘువీరా ఆరోపించారు.

రేపటి నుంచి ఏపీ నిట్ తరగతులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ నిట్ తరగతులు రేపటి(గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. పెద్దతాడేపల్లిలో వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో నిట్‌ తరగతలు ప్రారంభమవుతాయి. కేంద్ర సహాయమంత్రి పి.రాధాకృష్ణన్, రాష్ట్రమంత్రులు మాణిక్యాలరావు,గంటా, పలువురు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏపీ నిట్‌కు వరంగల్ నిట్ మెంటార్‌గా వ్యవహరిస్తోంది.

మద్యం లేక.. మంచం పట్టి!


  • గ్రామాల్లో స్వచ్ఛంద నిషేధం
  • మందుబాబుల అస్వస్థత
  • 3 రోజుల్లోనే వందమంది
  • భైంసా ఆస్పత్రిలో చేరిక 
  • సరిపోని పడకలు, నేలపై పడుకోబెట్టి చికిత్స 
ఎన్నో ఏళ్లుగా అలవాటైన మద్యం! ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది? నరాలు పట్టు తప్పాయి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోయింది. దీంతో ఆదివారం నలుగురు.. సోమవారం మరో 20 మంది.. ఒకరి తర్వాత ఒకరుగా అస్వస్థత పాలై ఆస్పత్రి బాటపట్టారు. మంగళవారానికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యింది. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ఇదుగో ఇలా కిందే పడుకోబెట్టి చికిత్స చేయడం మొదలుపెట్టారు.
 
కామోల్‌లో వైద్యశిబిరం నిండిపోవడంతో.. భైంసా ఆస్పత్రిలో మందు బాబులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి ఒక్కో పడకపై ఇద్దరికి చికిత్స చేశారు. అవీ నిండిపోవడంతో.. ఇంకొంతమందిని నేలపైనే పడుకోబెట్టి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. మద్యం సేవించే అలవాటున్నవారు ఒక్కసారి మానేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కాశీనాథ్‌ పేర్కొన్నారు.

.